MLA Sudheer Reddy extending support to small and local street vendorsMLA Sudheer Reddy extends support to small traders and local vendors.
MLA Sudheer Reddy extending support to small and local street vendors

పేదల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపాకే తదుపరి చర్యలు చేపట్టాలి

ఎల్బీనగర్, అక్టోబర్ 30: అభివృద్ధి పనుల పేరుతో పేద చిరు వ్యాపారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన చిరు వ్యాపారుల డబ్బాల విషయంలో మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకేఆర్ ఆర్చ్ నుంచి టీకేఆర్ కళాశాల వరకు 100 అడుగుల రహదారి నిర్మాణ ప్రణాళికలో భాగంగా రహదారి పక్కన వ్యాపారాలు నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారుల డబ్బాలను అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురువారం ఉదయం 6 గంటలకు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. నందనవనం ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాధిత చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిరు వ్యాపారులు తమ ఆవేదనను ఎమ్మెల్యేకు వివరించారు. రహదారికి అడ్డుగా ఉందని చెబుతున్న టీకేఆర్ ఆర్చ్‌ను తొలగించకుండా, తమ జీవనోపాధికి ఆధారమైన డబ్బాలను మాత్రమే తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేద చిరు వ్యాపారుల పట్ల ఒక విధంగా, రాజకీయ అండదండలు ఉన్నవారి పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నారా అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

కమిషనర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే

బాధితుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్ వికాస్ మహాతో ఫోన్‌లో మాట్లాడారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని కొన్ని రోజులపాటు కూల్చివేతలను నిలిపివేయాలని కోరారు. పేద కుటుంబాలు ఉపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వారికి తగిన జీవనోపాధి మార్గాలను చూపిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి సహకరించారు.

అభివృద్ధితోపాటు పేదల సంక్షేమమూ ముఖ్యం

అభివృద్ధి పనులు చేపట్టడం ఎంత ముఖ్యమో, వాటిపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల ఉపాధిని కాపాడటం కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారి నిర్మాణం, విస్తరణ పనుల వల్ల చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని కోరారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పిస్తూ అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సత్యంచారి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, నాయకులు శ్రీనివాస్ నాయక్, కాప్ర నాయక్, గోపి మధు, నాగిరెడ్డి, బిక్షపతి, సాయి యాదవ్, మహేందర్, కృష్ణ, నరేష్, రెడ్డిమాల కృష్ణ, విష్ణు గౌడ్, అనిత, కింగ్ మధు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *